31 డిసెంబర్ 2007

పగలు

మసకబారు చీకట్లో
మసిబారిన జగతిని
మందలిస్తూ
చీకటి గుండె చీల్చుకుంటూ
నెత్తుటిముద్దలా
వస్తున్నాడు సూరీడు

వేకువరేకల పందిరిలో
పిల్లగాలుల క్రాంతిరాగం
కొత్త కోయిల గానం
మరో పొద్దు పొడిచింది
నిజం నిద్దుర లేచింది

నల్లకొండల్లోఎర్ర సూరీడు
లేచి నుంచున్నాడు
నేనున్నానంటూ
నిజాన్ని నిర్భయంగా
చూడమంటూ
చరిత్ర మరోమారు
తిరిగి వ్రాయమంటూ...

మరోమారు
పగలు రాత్రిని జయించింది

పుట్టుక

ఒక ప్రేమావేశం
ఒక మోహావేశం
కోటికోట్ల జీవకణాల
రూపుదిద్దే లిప్తావేశం
క్షణభంగుర జీవితాన్ని
సృష్టించే
ప్రకృతి పారవశ్యం
జననమో, మరణమో
సహనమో, హననమో
సత్యమో, ధర్మమో
కష్టమో, సౌఖ్యమో
కాళరాత్రి చీకట్లో
కాంతిరేఖ వెలుగులో
ఏమీ తెలియని అద్వైతం!!

కొండచిలువై
కాలం మింగబోతోందని
అనుభవాలు
గుండె చీకట్లై నిండబోతోందని
తెలియని
మంచితనపుమెతకబిడ్డ
కనులెత్తి విశ్వాన్ని చూస్తొంది.

30 నవంబర్ 2007

ఏటి రాళ్ళు



ఎదురొడ్డిన ప్రతిసారీ
పక్కకు తిరిగి
దాటిపోతావ్!

ఆనవాళ్ళు వదిలిన
వేడి నిట్టూర్పు ఇంకిపోయినా
కారణాలు వెతకటం
మానుకోను

రాలిపడిన ఆకుల మీది
రహస్య సంకేతాలు
అర్థమయ్యేలోపు
నువ్వు చేరే తీరంలో
మరో రాయి
నీ స్పర్శ కోసం.

06 జులై 2007

నేనెవరు?

ఏ శిరోమండిత మకుటాన్ని?
ఎవరి పాదక్రాంతుడిని?
గడ్డిపూల మొదళ్ళు
పెకిలిస్తూ
అస్తిత్వమూలాలు
తెలుసుకునే ప్రయత్నం.
నా లోతుల్లోనన్ను వెదుక్కునే
అంతర్యాగం
ఈ అంతర్యానం ...

05 జులై 2007

స్పర్శ

వస్తావని తెలుసు.
ఎప్పుడు వస్తావో తెలియదు.
నిముషాలని, గంటలని దాటుకుంటూ
వస్తూనే వెళ్ళిపోయావ్
క్షణకాలపు నీ స్పర్శతో
కాలం ఎంత ఇరుకో తెలిసింది.
ఆనందం వెళుతూనే, దుఃఖం తోసుకొచ్చింది.
జ్ఞాపకాల బరువుకు కన్నీరు భారమా?
శూన్యం నుంచి శూన్యంలోకే
నా ప్రయాణం కూడా.
వీలైతే మళ్ళీ కలుద్దాం.