25 మార్చి 2016

తనలో తానై


రెప్పల పొదలో
రాలుతున్న తడి మబ్బుల
పరామర్శలతో..
రెక్కలు రాని చీకటి పిట్టల
పలకరింపులతో..

మన ప్రమేయం లేకుండానే
అన్నీ మరచిపోవాలనుకుంటాం!
ఏ మంచు మనలని
తాకలేదనుకుంటాం!!

చీకటి ఆకాశానికి
రంగుల వెలుగులు పరుస్తూ
నిశ్శబ్దమై రాలిన ప్రతి పూవు
కన్నీరు చుట్టుముట్టిన
కన్నీటి చుక్కై
తనలో తానై పారిపోతుంది.

18 మార్చి 2016

పసిపూలు


వంద ప్రశ్నలతో పరామర్శిస్తున్న
చీకటి పాటల
చిక్కటి నిశ్శబ్దంలో
పెదవులు తడిచేసుకుంటున్న
మహా సముద్రాన్ని
మౌనంగా క్షమిస్తూ
రెప్పల మధ్య
మరచిపోయిన
మరో రెండు వాక్యాలతో
మళ్ళీ అదే రాత్రి.

ఆకుల అలల మధ్య
దాగిన రహస్యాన్ని తెంపుకుని
ఒక్క చినుకు దూరంలో
నేలపై రాలిన పసిపూల
పసిడి నవ్వుల మధ్య
ఏ రాత్రీ నిద్ర పోలేదు
ఎలుగెత్తే ప్రవాహపు
అడుగుల శబ్దం
ఏ రాత్రీ మరువనీదు.

15 మార్చి 2016

జాలి పాట


కెరటాలై కొట్టుకుపోయిన
కొన్ని వాక్యాల వేడి స్పర్శ
మనలోనే
మరో లోకాన్ని చూపిస్తుంది.

పలుకు నాది కాదు
పాటా నాది కాదు
నీడల్లో దాగిన నా పాత్ర
నేననుకున్న నిజమూ కాదు.

జాలిగా పాడుకున్న
గాలి పాట
మైకం కమ్మిన మబ్బులా
ఆకాశం అంచున
ఊపిరి విడుస్తుంది.
అద్దంలా మెరుస్తున్న
సముద్రం
ఆకాశాన్నే మింగేస్తుంది!