07 అక్టోబర్ 2016

సరిహద్దుల్లో శవాలు

గాలితిత్తిగా మారిన
శరీరానికి
సుత్తితో
ఊపిరి వొంపుతుంటే
గజ్జె కట్టిన ఆకలికి
డప్పుల మోత వినిపిస్తున్నది
దప్పిక.


***

ఎంగిలి పళ్ళెంగా
మారిన
సరిహద్దుల్లో శవం
రాబందుల కోసం
వెతుక్కుంటున్నది.

***
కుబుసం విడిచిన
నాలుక
ఎందుకో
తెలియని కోపంతో
వంకర టింకరగా
వొళ్ళంతా పాకుతోంది.
కళ్ళు ఎర్రబడ్డాయి
కామ్రేడ్‌కి.

***
కోపంతో
పెడబొబ్బలు పెడుతున్నాడు.
కోపంతో
గుండెలు బాదుకుంటున్నాడు
కోపంతో
జుట్టు పీక్కుంటున్నాడు.
కోపంతో
తల గోడకేసి కొట్టుకుంటున్నాడు.
కోపంతో
నాలుక నేలకేసి రాస్తున్నాడు
కోపంతో
ఆకాశంపై ఉమ్మేస్తున్నాడు.

***
సరిహద్దులు దాటి
సర్జికిల్ స్ట్రైక్ చేసిన
సైనికులు
తన ఆకలి తీర్చలేదని
కొడవలితో
కొండ నాలుక కోసుకుంటున్నాడు
కామ్రేడ్‌.

05 అక్టోబర్ 2016

ఓడిపోతున్న యుద్ధం


ఏ.సీ. గదిలో
ఆలూ చిప్సు నంజుకుంటూ
ఆరో పెగ్గులో తూగులాడే
అడ్డగాడిదైనా
అమ్మకి, అమ్మలాంటి దేశానికి
ప్రాణాలే అడ్డు వేస్తాడే
చదువుకున్నవాడివి
ఆలోచనైనా చేయలేవా!!
ఓహో కామ్రేడునంటావా?


==
మతం నిచ్చెనలెక్కుతూ
మానవత్వం
మైనారిటీలో పడ్డప్పుడేగా
ఒక దేహం రెండు ముక్కలై
నలభై లక్షల శవాలుగా
తిరిగి వచ్చింది.


==
పవిత్ర యుద్ధంలో
పారే రక్తానికి
కారని పద్యాలు
శత్రువుని చంపిన
సైనికునిపై మాత్రం
శాపాలై వస్తాయే!


==
“సిగ్గులేదు నీకు”? అని మాత్రం అనను.
కామ్రేడువిగా!
“నిన్ను వోడించే యుద్ధం కాదురా
బడుద్ధాయ్!
నువ్వు వోడిపోతున్న యుద్ధం”!
అని చెప్పాలనిపిస్తుంది.
చెప్పను..
కామ్రేడువిగా.


==
నింగికెగసిన ఓ నక్షత్రం
నిజాయితీగా చెబుతోంది..
గాలిని నమ్మకు...
నీటినీ నమ్మకు...
పూలను నమ్మకు...
పరిమళాన్నీ నమ్మకు...
సంతోషించాల్సిన సామరస్యం
మర్చిపోయి
కలుషితమైన కలుపుమొక్కలివి
కామ్రేడ్లివి
ఎరువులకు బాగుపడేవి కావివి.
ఊడబెరుకు.
మేరా భారత్ మహాన్