కల్లు ముంత బద్దలయ్యింది
చీపురుపుల్లా ముక్కలయ్యింది
ఒకటి మత్తు నిచ్చి
మరోటి చెత్త నెత్తి.
ఇదేం బ్రతుకు?
కాలం చెల్లిన
ముసలమ్మా!!
పాడె కట్టాం కదా!
పడి నిద్దురపో
మంచమెందుకే నీకు?
000
రెక్కలు కొడుతూ రెప్పలార్పని కాకి
పక్కకు తిరిగి పారిపోయిన పావురం
కత్తులు నూరే కొమ్మల చప్పుడు
ఎన్ కౌంటర్ ఖాయం
భయమెందుకు?
రెల్లు పొదలో పాము బుసలా
గుండె చప్పుడు.
కాటేస్తా, నన్ను కవ్విస్తే
కుబుసం విడిచిందిప్పుడే
జాగ్రత్త.
000
బిచ్చమడిగిందో బొచ్చులేని కుక్క
పెంచుకోతగ్గదైతే బిస్కెట్ వేసేవాడే
కనీసం ఒక్క
ముద్ద అయినా వేసేవాడే
మరీ వీధికుక్కైపోయింది
ఏంచేస్తాడో!!
గొడ్డలి తెచ్చాడు వాడు
నరికేస్తాడుట ఈ నగరాన్ని
కాల్చి నాశనం చేస్తాడుట.
కుక్కకాశ్రయం ఇచ్చిన
ఈ మహానగరాన్ని.
000
పక్కలో పారాడుతూ పాము
నీ కన్నా ఇదే నయం
బెదురుపాటు కాదు
అరమరికలెందుకని సర్దుబాటు
అయినా నా గుండె శబ్దం నీకెందుకు?
పరుగెట్టే నగరంలో ఓ మూల
నెత్తుటిలో కలిసిన చెమటలా
పచ్చి ఇటుకలు కాలుతున్న వాసన
గొంతు చించుకుంటూ
పలుగు పార.
000
ఆకాశం అలిసిపోయింది
కబేళా నుండి ఎగిరొస్తున్న
శవాలలా కాకుల గోల
అర్ధం కాని అలజడేదో
హెచ్చరిస్తున్నది
ఊళ్ళో చెరువు, బడిలో గోడ
నిట్టూర్చే నీడల మధ్య
రాబందువులా
రాటుదేలిన నిశ్శబ్దం
రాళ్ళు పేర్చిన గుండె ఇది భయంలేదు
000
ఓసి పిచ్చి మొహం
ఎందుకీ ఘరానా వేషాలు
అప్పడిగి తెచ్చుకున్న అందం
మంచం కోళ్ళే మెచ్చుకోవు
నేనెలా ఉంచుకోను!
రైలింజనులాటి నా మొర
నిద్రలో గురకలానే ఉంది కాబోలు!
చాచి లెంపకాయ కొట్టినా
నా అరచేతికే
బొబ్బలు
000
చీకటి గుయ్యారం ఈ సమాజం.
మంచి చేస్తానంటే
మౌనంగా వింటారు.
దీపం తెమ్మంటే,
పక్కవాడిని చూస్తారు.
పావులా కిందపడితే మాత్రం
పదితలలు తిరుగుతాయి
నరికేస్తానంటే భయపడి
పదిజతల కాళ్ళు
పరుగెడతాయి.
సిగ్గులేకపోతే సరి!
000
చెరుకుగడ నిండా
చీమల ఎంగిలి
ఎంత పీల్చి పిప్పిచేసాయో?
చేతి నిండా పనిపెట్టింది.
అయినా, ఈ విషయం నా కనవసరం.
కంటినిండా దుమ్ముంటే
ఛత్వారం కళ్ళజోడు ఏం చేస్తుంది?
పీకిపక్కన పెడితే పోలా?
చూడలేని కళ్ళని
చూపలేని కళ్ళజోడుని
000
నాచు పేరుకుపోయి
నల్లగా ఉంది కోనేటిలో నీరు.
పొగచూరిన అద్దంలా
మసకబారినట్లున్న
మహానగరం.
నాచేగా తీసిపారేసావ్.
అద్దంలా మెరుస్తున్నది కోనేరు.
మసేగా తుడిచిపారేస్తే,
మహానగరమే
మాయమౌతుందేమో!
000
చేతిలో బ్యాగు,
బ్యాగులో పుస్తకం,
పుస్తకంలో పాఠాలు,
టిఫిను బాక్సు,
వాటర్ బాటిల్.
బతకనేర్చే పాఠం
మోతబరువే నేర్పిందిగా.
చించిపారేయ్ చదువుని.
బ్రతకటం మొదలేయ్.
జమీందారువైతే కాదుగా!
000
డొక్కుబస్సులో దడదడలాడుతూ
పక్కవాడెళ్లిపోయాడు.
ఏట్లో పడ్డాడో
కాట్లో పడ్డాడో
మొత్తానికెళ్లిపోయాడు.
విమానాశ్రయంలో మంచు.
ప్రయాణాలకు అంతరాయం!
రంపంతో కోసినా పాపంలేదు రన్వేలను.
ఎంతచిన్నతనం
ఇంకా ఇక్కడే ఉన్నా.
000
అమీర్ ఖాన్, ఐశ్వర్యారాయ్
సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్
పదిరూపాయలకే
దాహం తీరుస్తారుట
ఎంత అదృష్టం!
రూపాయ్ పొదుపు కోసం
పడుతూ లేస్తూ పరుగెడతావ్
నష్ట జాతకపు వెధవా!!
పదిరోజుల పొదుపుతో
నీ పిల్లడి దాహమైనా తీర్చు.
000
ఈ స్వేచ్ఛా వాయువుల్లో
ఎంతెంత స్వాతంత్రమో!
దివాలాకోరుతనం కాకపోతే
ముక్కుమూసుకొని
చస్తానంటావెందుకు?
రెపరెపలాడుతూ రెండు ఆకులు
తలలూపుతూ రెండు రోజాలు
బిక్కచచ్చి ముడుచుకున్నా
రమ్మంటూ పిలుస్తున్న మువ్వన్నెల జెండా
ఎక్కడికీ పోను.
000