04 అక్టోబర్ 2006

ధూపం

కసిదీరా మూడు దమ్ముల్లో కాల్చిపారేసిన సిగరెట్టు
యాష్ ట్రేలో ఆఖరిశ్వాస వదులుతుంది.
దీని త్యాగాన్ని ఊరకే పోనీను
ఊపిరితిత్తుల్లో భద్రంగా దాచుకుంటాను.

స్లోమోషన్ లో చావును అనుభవిస్తున్నా
జాస్మిన్ నవ్వు నాకింకా గుర్తున్నదంటే
గ్లాసులా తెరుచుకున్న గొంతులో
గిరికీలు కొడుతున్న షివాస్ రీగల్ కారణం కావొచ్చు
సిల్లీగా ఊదిన సిగరెట్ పొగా కావొచ్చు.

పాయిజన్ పరిమళంకన్నా మత్తెక్కించే రాత్రి నిషా
పరస్పర పరామర్శల తర్వాత
సీసాలా పారదర్శకమైనప్పుడు

ప్రపంచమంత యాష్ ట్రేలో దగ్ధమౌతూ
చితాభస్మాన్ని చీకటికి పూస్తూ...

పగలబడి నవ్వుకుంటూ
సానికొంపలా తెరుచుకున్న ఆకాశంలోకి
సూర్యుడిలా వెళ్ళిపోతాను.

22 సెప్టెంబర్ 2006

వానలాగ..


ఏళ్ళు మారినా
ఊళ్ళు మారినా
మట్టిలో కలిసే
మబ్బు వాసన మారలేదు

ఎన్నెన్ని అనుభూతులు
వెదజల్లి
గుండెలోతుల్లో
జ్ఞాపకాలు వెలికితీస్తుందో!

ఒక్కసారి
మబ్బుల్లో పుట్టి
మట్టిలో పొర్లాలనుంది...

11 సెప్టెంబర్ 2006

రాలిన పూలు



నావైపే చూసుకుంటున్నా
అద్దంలో నా పాత్రకు
మొదటి ప్రేక్షకుడిని
కాలేకపోతున్నా

ఎదుగుతున్న భ్రమల మధ్య
మబ్బు తునకలా
నేల మీది నా నీడ కోసం
వెతుకుతూనే ఉన్నా

చీకటి రొదలో
మలుపులు తిరిగే
నదీ ప్రవాహంలా
చూపుల ఎడారిలో
ఓ కన్నీటి చుక్క

రాల్చిన పూలు
చాలనుకుందేమో
స్తబ్దంగా గాలి.

29 ఆగస్టు 2006

అంతర్యానం





ఎలా మొదలేయాలనేదే
అసలు సమస్య

కనిపించిన ప్రతిరాయి
రహస్యంగా
నవ్వుతోందనే అనుమానం
దూర తీరాలకు
దూసుకెళ్ళే దృక్కులను
వెనక్కు లాగుతుంది.

సందేహ సముద్రంలో
చంద్రుడినై
అలల రాపిడి మధ్య
కాసేపు అస్తిత్వం కోల్పోతా

కలల మెట్లపై జారి
కన్నీరై కురిసే వేళ
అంతర్యానం చేయిస్తుంది
ఏకాంతం