27 జూన్ 2004

రేణువులు



వెదుకుతున్న
వెన్నెల కిరణం
ఏ ఇసుకతిన్నెల మీద
రాలిందో!

చీకటి చిరుగుల మధ్య
నక్షత్రాల నగ్నత్వం!

చూస్తూ...
ఆలోచిస్తూ...
ఆకాశం ముందు
మోకరిల్లిన మహా పర్వతం.

08 జూన్ 2004

నిశ్శబ్దం

తమస్సులో జ్వలించినా
ఉషస్సులా జనించినా
అదే స్వరం
అదే స్వనం
కుహూకుహూల కలధ్వనం
నిశ్శబ్ద శబ్ద ప్రతిధ్వనం


అనాది నెరుగు వేదమైన
అమ్మ మరుగు రోదనైన
అదే క్షణం
అదే క్వణం
నినాదనాద ఘోషణం
నిశ్శబ్ద శబ్ద ప్రతిధ్వనం

గీతగాన గోవిందుని
బలసూదనసూనుడిది
అదే రణం
అదే రవం
ప్రళయరావ గర్జనం
నిశ్శబ్ద శబ్ద ప్రతిధ్వనం

ప్రచండ భాను వీక్షణాన
శమింపు సోమరసామృతాన
అదే నాద
మదే ధ్వానం
నిశ్శబ్ద శబ్ద ప్రతిధ్వనం
నిశ్శబ్ద శబ్ద ప్రతిధ్వనం