అరమరికలు
లేవనుకున్న ఆకాశానికే
అడ్డుతెరల్లా
ప్రశ్నల చినుకులు
పర్వతంలా
పరుచుకున్న విషాదపు నిషాలో
అశ్రునిక్షిప్తమైన
ఆకాశం నిండా
అపశబ్దాలే.
అర్థంకాని
అలజడి మధ్య
ఆకాశం
నిద్రపోతున్నదంటే నమ్మలేం!
ఆగుతూ, సాగుతూ, పారుతున్న ప్రవాహంలో
ఎవరి
ఆత్మకథో
రాలిపోయిన
పూల నవ్వులా పలకరిస్తుంది.
అర్థంకాలేకే
కానీ,
అర్థం
లేక కాదు.
చదవాల్సిన
పాఠాలు
చెట్టు
మీది కాకి చెబుతూనే ఉంటుంది.
కాంతి
కిరణాలు కూలబడుతుంటాయి
పూసిన
గులాబీల లెఖ్ఖ
పూటపూటకు
మారుతూ ఉంటుంది.
ముభావంగా
ముడుచుకున్న
ఆకులపై
అక్షరాల
తడి
దొర్లిపోయే
క్షణాల మధ్య
ఇటువైపు
నీడలో
నిద్రపోవటం నాకు అలవాటే!