04 అక్టోబర్ 2013

అన్ కల్చర్డ్ కవిత్వం : మూడవ భాగం

లాక్షణికులు సూత్రీకరించిన విషయాలు తర్వాత తీరిగ్గా వ్రాయొచ్చు. ప్రస్తుతానికి రెండోరకం తీవ్రవాదుల గురించి మారికాసేపు మాట్లాడుకుందాం. వీళ్ళు గిరిగీసుకున్న గీతలు విచిత్రంగా ఉంటాయి. అవి ఆధునిక కవిత్వానికే (అంటే సోకాల్డ్ వచన కవిత్వానికే) అన్వయిస్తారు! ఆ గీతల్లో భా.భా.వ్యా. (భాష, భావం, వ్యాకరణమట!)లతోపాటు సరళంగా సూటిగా ఉండాలనే నియమాలు ముఖ్యమట! మరి ఇవన్నీ ఛందోబద్ధ పద్యాలకు అవసరంలేదా అంటే లేదు అనే అంటారనుకుంటా! సరే, ఈ గీతల మధ్య కూర్చొని ఓ పద్యం వేసుకుందాం. 

అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాతశత్రుడే 
యలిగిననాడు సాగరములన్నియు నేకము గాకపోవు క 
ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజరాజ నా 
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల గావు మెల్లరన్ 

అయ్యా... ఎవడండీ ఆ అజాతశత్రుడు అందులోనూ మహామహితాత్ముడనే విశేష కిరీటాన్ని ధరించినవాడు? ఆహా, ఆయనగారు ధర్మరాజట! అజాతశత్రువంటే ఏమిటండి? శత్రువులే లేనివాడా! మరి కౌరవులతో యుద్ధం చేయటానికి ఎందుకు సిద్ధమయ్యాడండి! 

మరో విచిత్రం.... అలగటం తెలియని ధర్మరాజు అలిగితే సముద్రాలన్ని ఏకమౌతాయట! అయ్యా, ఆ పద్యం చెప్పేంత వరకు ధర్మరాజువారు అలగలేదు కదా! మరి, సముద్రాలన్నీ ఏకమౌతాయని కవిగారికి ఎలా తెలిసింది? కవిగారి ఊహాశక్తి అపూర్వమనే అనాలనుకుంటా... ఎందుకంటే చందస్సులో ఉంది కాబట్టి. 

***

ఇక్కడో "సూటి" పద్యం వేసుకుందాం :


నుత జల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత  
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స  
త్క్రతు వది మేలు తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు త
త్సుత శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్


అయ్యా, ఇక్కడ ఆదికవిగారు "సూటి"గా చెప్పాలనుకున్న విషయం ఒక మంచి మాట గురించి. అది చెప్పటానికి నూతుల్లో దూకి, బావుల్లో తేలి, నానా క్రతువులు చేసి, బిడ్డని లెక్కలు చెప్పి, చివరికి తేల్చింది "సూనృత వాక్యము మేలు సూడగన్". ఇది చదివాక ఏమైనా పీక్కోవాలని, మరేదైనా చించుకోవాలని అనిపిస్తున్నదా? ఈ మాత్రపు విషయం పద్యంలోనే చెప్పాలనుకుంటే ఓ జాతి పద్యంలో చెప్పి ఉండొచ్చుగా! వృత్తాలు గీసుకోవటం దేనికి? గింగిరాలు తిరగటం దేనికి?

ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, ఆకాశం మీద ఉమ్మేయటం నా అభిమతం కాదు. సింపుల్గా సూటిగా చెప్పేస్తే పొదా అని ఎగతాళి వ్రాతలు వ్రాస్తే, మన సాహిత్యంలో మనకు మిగిలేవి వేమన పద్యాలు, సుమతీ శతకాలే. ఎన్ని గజాలు వ్రాసాడన్నది ముఖ్యం కాకపోయినా, అందులో కవిత్వం ఉన్నదా లేదా అనేదే ముఖ్య విషయం అవ్వాలి. మిగతావి ఆ తర్వాతే.

03 అక్టోబర్ 2013

అన్ కల్చర్డ్ కవిత్వం : రెండవ భాగం

రెండో రకం తీవ్రవాద ధోరణికి ముఖ్యకారణం వచనకవిత్వం పేరుతో అవాకులు చెవాకులు వ్రాసి కవిత్వంగా భ్రమింపచేసే ప్రయత్నాలే అనే విషయంలో సందేహం లేదు. వచన కవిత్వాన్ని కాసేపు పక్కనపెట్టి అసలు కవిత్వమంటే ఏమిటి అనే మౌలికమైన ప్రశ్న వేసుకుందాం. శబ్దరత్నాకరంలో పద్య, గద్యం, కవి అనే పదాలకు అర్ధాలున్నాయి కానీ, కావ్యానికి, కవిత్వానికి అర్ధాలే లేవు. గద్యం అంటే వచనం అని, పద్య అంటే ఛందోబద్ధంగా వ్రాసే కావ్యమని అర్ధాలు ఇచ్చారు.

ఈసందర్భంగా చంపూ కావ్యాల గురించి ప్రస్తావించాల్సిందే. "గద్య పద్య మిదం కావ్యం చంపూ ఇతి ఉచ్యతే" అన్నారు. అంటే, గద్యమూ పద్యమూ కలిపి కొడితే అది చంపూ కావ్యమట. మరి కవిత్వం మాట ఏమిటి? వచనాన్ని, ఛందస్సులో ఇరికిస్తూ వ్రాసే పద్యాలు కలిపి వ్రాస్తే అది కావ్యమౌతుందా? ఇక్కడ "దశోపదేశిగా" అక్కిరాజు ఉమాకాంతంగారి అభిప్రాయాలను ఉదహరించక తప్పదు. ముఖ్యంగా 8, 10.

1. గద్యంలోలేని విశేషం పద్యానికి ఛందస్సు సమకూర్చగలిగినది గతి మనోజ్ఞత.

2. అది గణాల ఆరోహణావరోహణల వల్లనే సిద్ధిస్తున్నది.

3. అక్షర వినోదం (వళిప్రాసలు) శబ్దాలంకారాల్లో చేరినది.

4. శబ్దాలంకారాలు అలంకారశాస్త్రంలోనివి.

5. శబ్దాలంకారాలు స్వయంగా ఆపతితమైతేనే తప్ప ఆవశ్యకంగా స్వీకార్యం కావని, వీటిని ప్రథానంగా స్వీకరిస్తే కావ్యం అధమమవుతుందని సాహిత్యవేత్తల మతం.

6. ఇద్ధరన్, మానుగ, అనఘ, అమల, ఓలి, ఒగి, పరగు, చెన్నుగ ఇట్లాటి దండగ చెత్తకు లేదా యతి భంగానికి హేతువై అనర్ధప్రదం కావటం వల్ల అక్షరాల ఆట (వళి ప్రాసలు) ఆవశ్యకంగా ఉపాదేయం కాదు.

7. యతి అంటే విచ్ఛేదం. వాగింద్రియ విశ్రాంతిని, శ్రావ్యతను, పద్యం యొక్క సుపఠత్వ, రమ్యత్వాలను సిద్ధింప చేస్తుంది గనుక దీర్ఘపాదాల్లో మధ్య యతీ సర్వత్ర పాదంత యతీ నియతం.

8. పద్యం గానీ, పద్యాలు గానీ, శీఘ్రంగా గాని, విలంబంగా గాని అల్లిన మాత్రాన పద్యకర్త అవుతాడు. కవి కానేరడు. విజ్ఞానశాలి కానేరడు. విద్వద్ఘోష్ఠులలో శాస్త్రాభ్యాసజన్యం విజ్ఞానం.
9. జన్మాంతర సంస్కార రూపమైన ప్రతిభ విద్వద్గోష్ఠుల్లో ఉత్తమ విజ్ఞాన లబ్ది, చరాచరలోకప్రభావ పరిశీలనం, కావ్యజ్ఞ శిక్ష కావ్యత్వహేతువని ముమ్మటుడు.

10.పద్యరూపానగాని, గద్య రూపాన గానీ అనువాదం చేస్తే అనువాది కాగలడు కాని, కవి కాజాలడు. రసభావ నిష్పాదకమైన సృష్టికి సంబంధించినది కవిత. కొంత తీసివేసి కొంతచేర్చి అనువాదం చేస్తే అప్రశస్తానువాది. అనూదిత కావ్యంలో సృష్టి విశేషాదులు అనువాదివి కాజాలవని స్పష్టం.

కాబట్టి స్థూలంగా తేలేదేమిటంటే, ఛందస్సులో ఇరికించి వ్రాసినంత మాత్రాన అది పద్యమే అవుతుంది కానీ, కవిత్వం కాదు. ఇక్కడ తేలే మరో విషయం ఏమిటంటే, గద్యంలో వ్రాసినా, పద్యంలో వ్రాసినా ఆ రచన కవిత్వం అనిపించుకోటానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండాలి. "నేటి కాలపు కవిత్వం" లో అక్కిరాజుగారు ఉద్దేశించిన, లాక్షణికులు సూత్రీకరించిన కొన్ని కవిత్వ లక్షణాలు తర్వాతి భాగంలో...

అన్ కల్చర్డ్ కవిత్వం : మొదటిభాగం

సాహితీప్రియులలో ముఖ్యంగా కవితా ప్రియులలో రెండురకాల తీవ్రవాద ధోరణులు కనిపిస్తుంటాయి.

మొదటిరకంలో, కవిత్వం పేరుతో వ్రాసే ప్రతిచెత్తను నెత్తినపెట్టుకోవటమే కాకుండా, అది సరికాదన్నవారికి సహృదయంలేదని తీర్మానించటం జరుగుతూ ఉంటుంది. వీరికి పరిసరాలలో ఏం జరిగినా స్పందించటానికి అవసరమయ్యే పనిముట్టుగా మాత్రమే కవిత్వం ఉపయోగపడుతుంది. భాషే చచ్చిపోతున్న రోజుల్లో కవిత్వం వ్రాసేవారిని ప్రోత్సహించాలనే మిషతో మొదలయ్యే వీరి ఉద్దేశ్యం కవిత్వానికి ముసుగులు వేస్తున్నదని గ్రహించినా గ్రహించనట్లు ఉంటూ ఉంటారు. గ్రూపులు కట్టటం, రాజకీయాలు చేసి అవార్డుల కోసం కక్కుర్తి పడటం వంటివి కూడా వీరి మీద ఉన్న అపవాదులే.

ఇక రెండో రకంలో, పైన చెప్పిన పెడధోరణుల్లో వస్తున్న కవిత్వం చదివి చదివి తల వాచిపోయి అసలు వచన కవిత్వమే అంత అని వస్తున్న మంచికవిత్వాన్ని కూడా అదే గాటన గట్టేస్తుంటారు. ముందస్తు దురభిప్రాయల వల్ల, మంచి కవిత్వాన్ని కూడా మందలో కలిపేయటం వల్ల మంచి కవిత్వం వ్రాసేవాళ్ళు కూడా కలం పట్టుకోటానికి సందేహించాల్సిన భయపడాల్సిన పరిస్థితులు వీరి వల్ల కలుగుతుంది. సంప్రదాయ కవిత్వాన్ని నెత్తిన పెట్టుకోవటం తప్పు అని చెప్పలేము. జాతి ఔన్నత్యాన్ని ప్రతిబింబించే సాంప్రదాయ రీతులని గౌరవించుకోవాల్సిందే. కానీ, ఆ మిషతో ఆధునిక కవిత్వాన్ని చులకన చేయటం ఎంతవరకు సమంజసం?

విచిత్రం ఏమిటంటే, ఇద్దరూ సాహితీ ప్రియులే! ఇద్దరూ మంచి కవిత్వాన్ని ఆస్వాదించగలిగే స్థాయి ఉన్నవాళ్ళే. మరి ఆయా ధోరణుల వల్ల కవిత్వానికి ఏరకంగా చేటు వస్తుందని అడిగితే, ఇతమిథ్ధంగా చెప్పలేము. అసలు ఇక్కడ కలిగే మౌలిక సందేహం ఏమిటంటే, ఈ పరిస్థితులు ఈకాలంలోనే ఉన్నాయా? సాంప్రదాయ కవిత్వానికి పట్టంకట్టిన గతకాలంలో లేవా? కృష్ణదేవరాయలవారి ఆస్థానంలో ప్రవేశానికి తెనాలి రామలింగ కవి ఎన్నేసి అగచాట్లు పడ్డారో కథలు విన్నాం. గ్రూపులు కట్టిన కవుల ఒకరినొకరు ఎలా ఎగతాళి చేసుకునేవారో కూడా కథలు కథలుగా విన్నాం. రాజుగారి ప్రాపకానికి కవులు ఏరకంగా పోటీలు పడేవారో కూడా విన్నాం.

అంతేకాదు, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన ఆంధ్రులకి చెప్పుకోదగ్గ కావ్యాలు ఎన్ని ఉన్నాయంటారు? ఒక వందా, రెండు వందలా, మూడు వందలా? మరి వేల సంవత్సరాల ఘనసాహితీ చరిత్రలో మిగిలినవి ఇవేనా? అంటే, ఇప్పుడు వస్తున్న "చెత్త కవిత్వం" స్థాయిలో ఆనాడు “చెత్త కావ్యాలు” రాలేదని చెప్పగలమా? కాదు కూడదు అంటే మనకు మిగిలిన కావ్యాలు ఎన్ని? నాణ్యతలేని కావ్యాలు కాల పరీక్షకు నిలువలేకపోయావనేకదా అర్ధం. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పటి కవిత్వమే చెత్త అని సాంప్రదాయబద్ధమైన ఛందోబద్ధమైన కవిత్వాన్ని నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? చెత్త ఎప్పటికైనా చెత్తే, అవి చరిత్రలో మనవు అని ఎందుకు సరిపెట్టుకోలేము?