30 జులై 2006

జుట్టు చెదిరిన ఆకాశం



వర్షం వెలిసిన
ఆకాశం
నవ్వే పూలు
వెన్నెల స్పర్శ

నిజాలని నిర్దయగా
అభిశంసించే
నాటకంలో
చీకట్లో చిత్తరువులా
నా పాత్ర నైరూప్యం

అక్షరానికో
కాలు పుట్టించి
చీకటి గుహలో చొరబడే
అవమానాన్ని
అణగదొక్కాలన్న కసి

నాకు అర్థమైన సాయంత్రం
జుట్టు చెదిరిన ఆకాశం
విచ్చు కత్తులు
వేడి కొలిమి

22 జులై 2006

శ్రావణ మేఘాలు


అవసరానికో
రంగు మార్చే ఆకాశంలో
ఎదురుపడ్డ
రెండు మబ్బులు

కళ్ళ మెరుపుల మధ్య
కురుస్తున్న వర్షం

విడివడిన
కొసలు బిగిస్తూ
జ్ఞాపకాల హరివిల్లు

04 జులై 2006

సశేషుడు





చీకటి చెదలు
పట్టాయనా
ఇంకా
పొద్దుపొడవటం లేదు?

వసంతం వెంటలేదనా
కనపడే రంగుల్లో
కోయిల గొంతు
వినిపించటంలేదు?

నీకోసం
ఆగింది ఈ ప్రవాహం
పిట్టలా మరోసారి
తొంగిచూడు.

కనిపించేది
నీడ కాదు.
నిజానికి నువ్వే.