05 మార్చి 2010

"చివరకు మిగిలేది" - ఓ ఆక్రోశం

"చివరకు మిగిలేది" పురాణమూ కాదు, ఇతిహాసమూ కాదు. ఓ కాకమ్మ కథ, పిచ్చుకమ్మ కథ లాంటి ఓ బుచ్చిబాబు వ్రాసిన కథ. జీవితంలో ప్రేమించలేకపోవడమే ఒక విషాదంగా నమ్మి, దానికి తను నమ్మిన ఇతర తాత్వికచింతనలు జోడించి నలుగురితో తన బాధను పంచుకుందామని "బుచ్చిబాబు" చేసిన ప్రయత్నం "చివరికి మిగిలేది". 1952 లో జరిగిన మొదటి ముద్రణ నుంచి, 2006 వరకు జరిగిన ఆరవ ముద్రణ వరకు, యాభైనాలుగేళ్ళల్లో ఆరు ముద్రణలు పూర్తి చేసుకున్నదంటే ఈ నవల ఖచ్చితంగా క్లాసిక్కే. క్లాసిక్ కాకపోయినా, యాభై ఏళ్ళ తర్వాత కూడా పాఠకులు ఆదరిస్తున్నారు కాబట్టి, తెలుగు సాహిత్యంలో ఈ నవలకు, ఈ నవలకున్న అగ్రస్థాయికి వచ్చిన ఢోకా ఏమీలేదు.

ఆ విషయం పక్కనపెట్టి, స్థూలంగా "చివరికి మిగిలేది" ఒక కథలా మాత్రమే పరిగణించి పరికిస్తే, కథనంలో కవిత్వాత్మక వచనం, ఆత్మ సంశోధనా, సంవేదన భరితమైన కొన్ని రసవత్తర ఘట్టాలు తప్పించి, ఓ సామాన్యమైన కథే కనిపిస్తుంది. "కన్యాశుల్కం" లాంటి రచనలతో పోలిస్తే, అక్కడక్కడ స్త్రీస్వామ్య భావజాలాన్ని ప్రదర్శించటం తప్పించి, ప్రత్యేకించి ఎన్నదగ్గ సామాజిక విలువలు కూడా లేవు.

చెప్పుకోదగ్గంతగా లేని సామాజిక విలువల కారణంగా ఈ పుస్తకానికి పట్టం కట్టలేని పరిస్థితి ఒకవైపైతే, పేలవమైన కథ కారణంగా, కథనంలోని అద్భుతమైన సాహితీ విలువలకు పట్టం కట్టలేని దుస్థితి మరో వైపు. నా ఆక్రోశం కూడా అదే!

* * *

సామాజిక ధృక్కోణాలు మారుతున్నాయి. అలానే, సామాజిక, సాహితీ విలువలు కూడా మారుతున్నాయి. ఆలోచనా పరిధుల్లో కూడా చెప్పుకోదగ్గ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గమనిస్తే, పుస్తకం.నెట్ లోని "హేలి" గారి సమీక్ష నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు, నెత్తి నోరు బాదుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. "

శరత్ సాహిత్యంలో తలమానికమై భాసించే "దేవదాస్" కు పట్టిన దుర్గతితో పోలిస్తే, హేలీ గారి వ్యాసం పెద్ద లెక్కలోది కూడా కాదు. ఈ రోజుల్లో కొద్దిగా గడ్డం పెంచితే, అమ్మాయిగాని హాండిచ్చిందా, దేవదాసయ్యావని పరామర్శించే మిత్రులకు కొదవలేదు. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో "దేవదాస్" ను ఆదరించి ఉండవచ్చు. ఆ పరిస్థితులు ప్రస్తుతమైతే లేవు.

అదేవిధంగా, తెలుగులో అభ్యుదయ రచనలకు ఆద్యుడుగా గురజాడ అప్పారావుగారికి ఉన్న గౌరవం మరెవ్వరికీ లేదు. కానీ, ఆరోజుల్లో ఆయన వ్రాసినట్లుగా "దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టిమాటలు కట్టి పెట్టి, గట్టి మేల్ తలపెట్టవోయ్" అని ఈరోజుల్లో వ్రాస్తే, సందేశాలాపి కవిత్వం చూపించమంటారు నేటితరం కవులు, విమర్శకులు.

మారుతున్న సామాజిక ధోరణికి అనుగుణంగా ప్రజలూ మారుతున్నారు. మారుతున్న ప్రజల ప్రామాణికాల కనుగుణంగా, ఆయా రచనలను బేరీజు వేస్తున్నారు. పురాణేతిహాసాలకే దిక్కులేని పరిస్థితుల్లో, అటువంటి సమీక్షలకు, విమర్శలకు ఆక్రోశించాల్సిన అవసరం లేదు.

* * *

ఈ పుస్తకంలోని పాత్రలు కల్పితమో కావో ఇతమిద్ధంగా చెప్పాల్సిన అవసరం లేకపోయినా, రచయితగా బుచ్చిబాబు చేసే తత్వ విచారణ మాత్రం, ఆయనని రచయితకన్నా కూడా తాత్వికునిగా మరో మెట్టుపైన నిలబెడుతుంది. నా వరకూ ఇందులో కథ ముఖ్యం కానేకాదు. ఆయా పాత్రల నేపథ్యంలో రచయిత వ్యక్తపరుస్తున్న తాత్విక చింతన ముఖ్యం. ఆ కోణంలో ఆలోచిస్తే, అద్భుతమైన వాక్యాలు గుట్టలు గుట్టలుగా ఇందులో కనిపిస్తాయి.

సాథారణమైన కథకు అసాథారణతను చేకూర్చింది రచయితలోని అభివ్యక్తే. అద్భుతమైన కవిత్వాత్మక వాక్యాలవల్లనే, పేలవమైన కథ కూడా చదివింపజేస్తుంది. అద్భుతమైన ఆ వాక్యాలతో, కావ్య సృష్టి జరిగుంటే, మన జ్ఞానపీఠాలకు ఖచ్చితంగా గౌరవం దక్కి ఉండేదని నా నిశ్చితాభిప్రాయం.

ఓ రెండు ఆణిముత్యాల్లాంటి పంక్తులు చూద్దాం : 

* * *

గడ్డిపోచ విలువెంత?

చివరికి మిగలడం! పడమటి ఆకాశంలో సూర్యుడు ఎర్రగా ఆవులించి మరో ప్రపంచంలో మూర్ఛిల్లిపోతే మిగిలినవి, పగటిని వదల లేక రాత్రిని వెతుక్కునే మత్తు మేఘాలు, నక్షత్రాలు  భయంతో మెరుస్తున్నాయి. కాలవ తోకని త్రిప్పుకుంటున్న నల్లత్రాచులా వంకర తిరిగి అంతర్ధానమైంది. ఆకాశం కేసి చూస్తూ ఒడ్డున గడ్డిపోచల మధ్య దయానిధి నవ్వుకున్నాడు.

అంత భయపడాల్సిన అవసరం ఏమిటన్నట్లు దయానిధి నవ్వినట్లు అనిపిస్తుంది. ఆ అవసరం లేదంటూ, బుచ్చిబాబు తర్వాతి పంక్తుల్లో చెప్పే వాక్యాలు అనితరసాధ్యం.

శరీరాన్ని ఆవరించుకున్న గాలి అందమైన అల్పానుభవం. శరీరం దాహంతో వికసిస్తుంది. ...... కళ్ళు చూడడంమానుకుని దర్శిస్తాయి. పడమటి ఆకాశంలో పూడుకుంటున్న పుండు రాత్రి వెదకటం విరమించుకున్న మేఘాలు, భయం లేకుండా మెరుస్తున్న నక్షత్రాలు, ........ కదులుతున్న గడ్డిపోచలు, మూగ భక్తితో ప్రశాంతం చెందిన ప్రకృతి, తనూ - అన్నీ ఏకమైపోయి ఒక్కసారి చైతన్యం పోగొట్టుకొని, ప్రపంచంతో నిమిత్తం లేకుండా ఉండిపోయాయి.

* * *

అలలు మెల్లగా గట్టు మీద ఊపిరి తీసుకుంటున్నాయి. మట్టిలో వేడిగాలి పైకి వెళ్ళలేక భూమినే ఆవరించుకుంది. పొడుస్తున్న చుక్కల ప్రతిబింబాలు చెరువులో పడ్డాయి.

* * *

చెప్పుకుంటూ పోతే, దాదాపు సగం పుస్తకాన్ని వ్రాయాల్సి ఉంటుంది. పేలవమైన కథ కారణంగా, కథనంలోనిఅద్భుతమైన సాహితీ విలువలు ఎలా నిరుపయోగమయ్యాయో అనేదే నా ఆక్రోశం.

బుచ్చిబాబు మాటల్లోనే నా ఆక్రోశం చెప్పాలంటే "పరిమళం బరువుకీ రంగు వొత్తిడికీ తట్టుకోలేక వూడి పడిపోయిన అడవి పువ్వు; పర్వత శిఖరాన్నుంచి జారి పడిపోయిన మంచు ముద్దలోని నిర్మలత్వం; నిశీధిలో సృష్టి వేసుకున్నమంటలో నడిజ్వాల అర్ధరాత్రి జీవులు కన్న స్వప్నంలోని మూగ బాధ."

24 ఫిబ్రవరి 2010

ఊరి చివర (అఫ్సర్) - పరిచయం



అడపాదడపా అంతర్జాలంలో చదవటమే అఫ్సర్ గారి కవిత్వాన్ని. అక్కడక్కడ, ఆయనని మాటల్లో దించి సందేహాలకు సమాధానాలు వెతుక్కునేవాడిని ఆయన వ్యాసాల్లో. అంతకు మించి ఆయనతో ఎటువంటి పరిచయం లేదు. అంతర్జాలంలో సాహితీ సహవాసానికి, ఆ మాత్రం పరిచయం సరిపోతుందేమో కదా! "ఊరి చివర" ఉప్పెనలా పొంగిన అఫ్సర్ గారి కవిత్వంపై నా అభిప్రాయమే ఈ వ్యాసం.

ఇప్పటి రోజుల్లో, ఊరు చివర అనగానే నిజంగా నిస్తేజమై స్ఫురించే ఒకానొక చిత్రమే ఈ "ఊరు చివర" కూడా. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాదు, మనను చుట్టుముట్టిన ప్రపంచాన్ని నిజాయితీగా ఆవిష్కరింపచేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో. సామాన్యంగా కవిత్వంలో సామాజికతను చొరబెట్టాలని కొందరు చేసే ప్రయత్నంలో, పడికట్టు పదాల విన్యాసమే కనిపిస్తుంది. ఆ విన్యాసాల సంరంభంలో ఊళ్ళు తగలబడతాయి, ఆకాశాలు విరిగిపడతాయి, చేతులు నరకబడతాయి, అలానే కవిత్వమూ కూలబడుతుంది. ఈ విన్యాసాలకు దాదాపు అతీతంగా, ఊరు చివర నిలువెత్తు "నిశ్శబ్దంలో" నిలుస్తుంది అఫ్సర్ గారి కవిత్వం.

ఈ పుస్తకం చదవాలంటే, ఊరి చివర నుంచి ఊళ్ళోకి ప్రవేశించాలి. వరుసబెట్టి, మూడు సార్లు చదివిన తర్వాత నేను తీర్మానించిన విషయం ఇది :)) మీకు అర్ధమైన విషయం కరెక్టే... ఈ పుస్తకం చివరి నుంచి ఓసారి, మొదటి నుంచి ఓసారి చదివి చూడండి.

జండాలో జాతీయ గీతాలో
పార్టీలో రాజ్యాంగాలో రాజ్యాలో
వోటు హక్కులో ఎన్నయినా వుండనీ
గుప్పెడు మెతుకులే రాజ్యాంగం మాకు
గుక్కెడు నీళ్ళే జాతీయ గీతం మాకు

ఈ సంకలనంలో కవి ఆవిష్కరింపబోయే విషయం ఇక్కడే చూచాయగా తెలుస్తుంది. అందమైన నిశ్శబ్దంలో అలరించే పాలపిట్టల పకపకల కోసం "ఊరి చివర"కు వెళ్ళొద్దు. ఎవరు వెళతారో "చివరికి" కవి మాటల్లోనే చూస్తే బాగుంటుంది :

ఎవరొస్తారో
ఈ వూరి చివరకి!
ఆకాశం కూడా వేలు విడిచిన
దిక్కులేని దేహం కొసకి.
మాటలన్నీ రాలిపోయి
మోడై నిలిచిన చెట్టు కొసకి.

వొళ్ళంతా పిడచకట్టి
పగిలిపోయిన చెరువు వొడ్డుకి
వొక్క దేహమే వెయ్యి ముక్కలయిన
శకలాల ఎముకల కలలతోపుకి.
ఎవ్వరొస్తారో ఈ వూరి చివరకి?

చివరికి వచ్చింది "ఎవరికైనా, ప్రేమతోనే" కవి చెబుతున్న విషయం, ముఖ్యంగా మన అంతర్జాల కవి మిత్రులకు కనువిప్పు కావాల్సిందే :

నడుస్తొందే, వొక సంతలో!
అన్నీ తెగనమ్ముకున్న
అన్నీ ఎక్కడికక్కడ దిగవిడిచిన
మార్కెట్ సరుకుల సమూహం.

నేపథ్యాల రణగొణ ధ్వనులెందుకులే,
పద్యాల మధ్య
రాజకీయ నినాదాల హోరెందుకులే,
అన్నీ మర్చిపోయిన జాతికి
నీతివాక్యాల ముక్తాయింపులెందుకులే
.....
.....
నువ్వేమిటో
నీ పద్యమే చెబుతుంది!
తెగిన నీ పద్య పాదానికి
కట్టు కట్టలేను, క్షమించు,
.....
.....
మళ్ళీ రాయ్
పిచ్చి గీతల మధ్య అ ఆలు వెతుక్కో
అప్పటికీ నీకు నువ్వు దొరక్కపోతే
ఓ పిల్లాడి చేతిలో
బొమ్మవై పో!
వాడి ఆటలో కాసింత ఆనందపు తుంకవై పో!
అప్పుడింక కొత్త మాట రాయ్!

హిందిలో "ఓ ఆ రహా హై, ఖానా ఖానే కే లియే" అనేది శుద్ధ వచనం. అదే వాక్యాన్ని, నేను విన్న కొందరు హిందీ కవులు "ఆ రహా హై ఓ, ఖానే కే లియే ఖానా" అంటారు అదేదో విరగదీసే కవిత్వం చెబుతున్నట్లు. అలా ఉన్నాయి ఓ రెండు వాక్యాలు ఈ కవితలో (నడుస్తోందే, వొక సంతలో!....పరిగెత్తుతోంది వొక సంతలో!...). అవి సిల్లీ విషయాలైనా, నా అభిప్రాయం చెప్పాలనిపించేసింది, చెబుతున్నాను.

ఇలా అనుకున్నానో లేదో, ఆశ్చర్యం గొలిపుతూ "ఇఖ్ రా!"

లోకం
నాకు వంకరగా కనిపిస్తుందనే కదా
నువ్వెప్పుడూ అంటావ్

లోకం కాదు
నేనే వంకరగా వున్నానని కదా, నీ అర్ధం!
.....
.....
ఇంతకీ

ప్రశ్నని మించిన వక్రరేఖ
ఏదీ ఇంకోటి చూపించు.

అంటూ... మొహంలో మొహం పెట్టి అఫ్సర్ గారు ప్రశ్నిస్తూ వ్రాసిన ఈ కవిత, నా వరకూ శివారెడ్డి మార్కు అద్భుతమైన కవిత! అఫ్సర్ గారి బెంచ్ మార్క్ ప్రకారం ఓ సాథారణ కవిత. అన్నట్లు, ఏ సందర్భంలో ఈ కవిత పెల్లుబికిందో చెప్పనవసరంలేదు అనిపించింది. ఎందుకంటే, ఇప్పటి కాలమాన పరిస్థితుల మధ్య ఎప్పటికీ అన్వయించుకోగల కవిత ఇది. ఇటువంటి, అఫ్సర్ మార్కు సాథారణ కవితలు అక్కడక్కడ కనిపించాయనే చెప్పక తప్పదు.

కరెక్టుగా చివరి నుంచి నాలుగో కవిత "నాలుగు మెతుకులు"

బయట విరగ్గాస్తున్న ఎండకి
లోపటి చీకటి తెలుస్తుందో లేదో!
కాసేపు
గొంతుక
వ్యాహ్యాళికెళ్తుంది మౌనంలోకి
గాలి కోసం
కాసింత వూపిరి కోసం
.....
.....
ఒక్కోసారి నువ్వూ నేనూ
రెండు అలల కేకలం
మరోసారి
నిద్ర పొరల కింద వొత్తిగిలిన కలలం.
.....
.....
ఈ నాలుగు మెతుకులూ
దాచి వుంచు
ఏ దూరాల నించో వచ్చే
ఆ దిగులు బావి
ఖాళీ కడుపు కోసం!

ఈ "నాలుగు మెతుకులతో" చిక్కటి కవిత్వం కోసం అలమటించేవారికి పంచభక్ష్య పరమాన్నం వండి వడ్డించారు అఫ్సర్ గారు. చాలా అద్భుతమైన కవిత్వం. ఇలా తేరుకునే లోపే..."థియేటర్ స్క్వేర్" లోకి ఆహ్వానిస్తారు కవి.

ఒక నిశ్శబ్దంలోకి అందరూ
మౌనంగా
తెరమీద
ఎవరి కథల్ని వాళ్ళే విప్పుకుంటారు తీరా...
.....
.....
ఎవరి జీవితం వాళ్ళకి చేదు
అవతలి బతుకు
కాసేపు అద్దం
తెలియని అర్ధానికి
.....
.....
థియేటరు
నన్ను అనువదించే యంత్రం
ఇక్కడ
నన్ను నేను వెతుక్కుంటాను
ప్రతి సాయంత్రం

చెప్పుకుంటూ పోతే, చాలా కవితలున్నాయి. ఇవన్నీ ఒకరు చెబితే వినటం కన్నా, చదివి తీరాల్సిన అనుభూతులు ఒక్కో కవిత. కంట తడిపెట్టించేవి కొన్నైతే, కలకలం రేపేవి కొన్ని.జి.వి.ఎన్ మూర్తిగారు "ఈనాడు"లో చెప్పినట్లు, మన లోతులని మనమే తడుముకునేట్లు చేసే కవిత్వం ఇది.

కవి సమాధి
ఒక కొల్లేజ్ పోయెం
నీరెండలో వూరు
రెండంటే రెండు మాటలు
.....
.....
అనుమానితుడి ఆత్మకథనం (నాకెందుకో మా అన్నాజీ ఇక్బాల్ చంద్ గారి "ఆరో వర్ణం" కవిత గుర్తుకొచ్చింది. "ఆరో వర్ణం"లోని క్లుప్తత మాత్రం ఈ కవితలో లేదు. అయినా బాగుంది, అది వేరే విషయం.)

జటిలమైన కొన్ని అనుభూతులుంటాయి. అందులోనూ పరభాషా కవిత్వంలో, అక్కడి మహాకవులు వ్రాసినవి. సామాన్య భాషకు, సామాన్య కవులకు ఆ అనుభూతులు అందవు. అటువంటి అనుభూతులు కూడా అలవోకగా, తనదైన శైలిలో కవిత్వమై పారిస్తారు అఫ్సర్ గారు "సరిగంగ స్నానం" అనే కవితలో. అది అనువాదమని ఆయన చెబితే గానీ, బహుశా మనం తెలుసుకోలేమేమో!

మంచి కవితల గురించి తక్కువగానే అయినా, ఎలాగూ చెప్పుకున్నాం కాబట్టి, ఒకట్రెండు దిష్టి చుక్కల గురించి (ఐ మీన్ శివారెడ్డి మార్కు అద్భుత కవిత్వం కూడా ఉదహరించుకుందాం.)

కలలో ఈద్ గాహ్
డెజావూ...
వీరుడి శిరస్సు

అద్భుతమైన ఉద్వేగాన్ని మిగిల్చినా, శివారెడ్డిని మించిన పద ప్రయోగాలు చేసారు అఫ్సర్ గారు. అంతకు మించి అభిప్రాయాన్ని చెబితే, "ఊరి చివర"కు ద్రోహం చేసినట్లౌతుంది కాబట్టి, ఇక్కడితో విరమిస్తా.

అన్నట్లు, అఫ్సర్ గారికి నాదో మనవి. కవిత్వం గురించి అంతర్జాలంలో చాలానే భ్రమలు ఉన్నాయి. ఆ భ్రమలు తొలగించాలంటే, "ఊరి చివర" లోని కవిత్వం అందుబాటులో ఉండాలి. వీలువెంట, ఈ కవితలని అంతర్జాలంలో కూడా ఆవిష్కరిస్తే బాగుంటుంది.

మరో చివరి మాట. ఈ పుస్తకాన్ని చివరిని నుంచి చదవమని చెప్పటానికి ఉన్న మరో ముఖ్యమైన కారణం - గుడిపాటి గారు, ఎన్. వేణుగోపాల్ గారు వ్రాసిన ఆప్త వాక్యాలు. ముందుగా అవి చదివితే, వారి మాటలు దురభిమానంగా పాఠకులు అనుమానించే అవకాశం ఉంటుంది. మొత్తం కవితలు చదివాక, వారి ఆప్తవాక్యాలు ఎంత నిజమనేది తెలుస్తుంది.