30 మే 2004

మెరుపు కలలు



కలల ప్రపంచం
నాకేమీ కొత్తకాదు.
చీకటి చేతుల్లో
మెరిసే గీతల్లో
నన్ను నేను చూసుకుంటూ
మురిసిపోయే ప్రపంచం అది.

చలి చీమల తలలు వంచి
వర్షపు చుక్కల నిచ్చెనలెక్కి
ఆకాశానికి
మెరుపుకలల ఉచ్చులు బిగించి
చీకటి దుప్పటిలో దాగిన
చంద్రుడిని
రోజూ దోచుకుంటూనే ఉంటాను.

రెండు పగళ్ళ మధ్య


నిన్నటి కలలు
రేపటి ఆశల మధ్య
ఆగిపోయిన ఓ రాత్రి

నిన్న వాడిన పూవును
పలకరిస్తూ
పల్లవిస్తున్న మరో పూవు

రెండు పగళ్ళ మధ్య
ఓ చీకటి అంతరం
రాలిపడుతున్న మరో నక్షత్రం