04 అక్టోబర్ 2013

అన్ కల్చర్డ్ కవిత్వం : మూడవ భాగం

లాక్షణికులు సూత్రీకరించిన విషయాలు తర్వాత తీరిగ్గా వ్రాయొచ్చు. ప్రస్తుతానికి రెండోరకం తీవ్రవాదుల గురించి మారికాసేపు మాట్లాడుకుందాం. వీళ్ళు గిరిగీసుకున్న గీతలు విచిత్రంగా ఉంటాయి. అవి ఆధునిక కవిత్వానికే (అంటే సోకాల్డ్ వచన కవిత్వానికే) అన్వయిస్తారు! ఆ గీతల్లో భా.భా.వ్యా. (భాష, భావం, వ్యాకరణమట!)లతోపాటు సరళంగా సూటిగా ఉండాలనే నియమాలు ముఖ్యమట! మరి ఇవన్నీ ఛందోబద్ధ పద్యాలకు అవసరంలేదా అంటే లేదు అనే అంటారనుకుంటా! సరే, ఈ గీతల మధ్య కూర్చొని ఓ పద్యం వేసుకుందాం. 

అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాతశత్రుడే 
యలిగిననాడు సాగరములన్నియు నేకము గాకపోవు క 
ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజరాజ నా 
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల గావు మెల్లరన్ 

అయ్యా... ఎవడండీ ఆ అజాతశత్రుడు అందులోనూ మహామహితాత్ముడనే విశేష కిరీటాన్ని ధరించినవాడు? ఆహా, ఆయనగారు ధర్మరాజట! అజాతశత్రువంటే ఏమిటండి? శత్రువులే లేనివాడా! మరి కౌరవులతో యుద్ధం చేయటానికి ఎందుకు సిద్ధమయ్యాడండి! 

మరో విచిత్రం.... అలగటం తెలియని ధర్మరాజు అలిగితే సముద్రాలన్ని ఏకమౌతాయట! అయ్యా, ఆ పద్యం చెప్పేంత వరకు ధర్మరాజువారు అలగలేదు కదా! మరి, సముద్రాలన్నీ ఏకమౌతాయని కవిగారికి ఎలా తెలిసింది? కవిగారి ఊహాశక్తి అపూర్వమనే అనాలనుకుంటా... ఎందుకంటే చందస్సులో ఉంది కాబట్టి. 

***

ఇక్కడో "సూటి" పద్యం వేసుకుందాం :


నుత జల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత  
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స  
త్క్రతు వది మేలు తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు త
త్సుత శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్


అయ్యా, ఇక్కడ ఆదికవిగారు "సూటి"గా చెప్పాలనుకున్న విషయం ఒక మంచి మాట గురించి. అది చెప్పటానికి నూతుల్లో దూకి, బావుల్లో తేలి, నానా క్రతువులు చేసి, బిడ్డని లెక్కలు చెప్పి, చివరికి తేల్చింది "సూనృత వాక్యము మేలు సూడగన్". ఇది చదివాక ఏమైనా పీక్కోవాలని, మరేదైనా చించుకోవాలని అనిపిస్తున్నదా? ఈ మాత్రపు విషయం పద్యంలోనే చెప్పాలనుకుంటే ఓ జాతి పద్యంలో చెప్పి ఉండొచ్చుగా! వృత్తాలు గీసుకోవటం దేనికి? గింగిరాలు తిరగటం దేనికి?

ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, ఆకాశం మీద ఉమ్మేయటం నా అభిమతం కాదు. సింపుల్గా సూటిగా చెప్పేస్తే పొదా అని ఎగతాళి వ్రాతలు వ్రాస్తే, మన సాహిత్యంలో మనకు మిగిలేవి వేమన పద్యాలు, సుమతీ శతకాలే. ఎన్ని గజాలు వ్రాసాడన్నది ముఖ్యం కాకపోయినా, అందులో కవిత్వం ఉన్నదా లేదా అనేదే ముఖ్య విషయం అవ్వాలి. మిగతావి ఆ తర్వాతే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి