03 అక్టోబర్ 2013

అన్ కల్చర్డ్ కవిత్వం : మొదటిభాగం

సాహితీప్రియులలో ముఖ్యంగా కవితా ప్రియులలో రెండురకాల తీవ్రవాద ధోరణులు కనిపిస్తుంటాయి.

మొదటిరకంలో, కవిత్వం పేరుతో వ్రాసే ప్రతిచెత్తను నెత్తినపెట్టుకోవటమే కాకుండా, అది సరికాదన్నవారికి సహృదయంలేదని తీర్మానించటం జరుగుతూ ఉంటుంది. వీరికి పరిసరాలలో ఏం జరిగినా స్పందించటానికి అవసరమయ్యే పనిముట్టుగా మాత్రమే కవిత్వం ఉపయోగపడుతుంది. భాషే చచ్చిపోతున్న రోజుల్లో కవిత్వం వ్రాసేవారిని ప్రోత్సహించాలనే మిషతో మొదలయ్యే వీరి ఉద్దేశ్యం కవిత్వానికి ముసుగులు వేస్తున్నదని గ్రహించినా గ్రహించనట్లు ఉంటూ ఉంటారు. గ్రూపులు కట్టటం, రాజకీయాలు చేసి అవార్డుల కోసం కక్కుర్తి పడటం వంటివి కూడా వీరి మీద ఉన్న అపవాదులే.

ఇక రెండో రకంలో, పైన చెప్పిన పెడధోరణుల్లో వస్తున్న కవిత్వం చదివి చదివి తల వాచిపోయి అసలు వచన కవిత్వమే అంత అని వస్తున్న మంచికవిత్వాన్ని కూడా అదే గాటన గట్టేస్తుంటారు. ముందస్తు దురభిప్రాయల వల్ల, మంచి కవిత్వాన్ని కూడా మందలో కలిపేయటం వల్ల మంచి కవిత్వం వ్రాసేవాళ్ళు కూడా కలం పట్టుకోటానికి సందేహించాల్సిన భయపడాల్సిన పరిస్థితులు వీరి వల్ల కలుగుతుంది. సంప్రదాయ కవిత్వాన్ని నెత్తిన పెట్టుకోవటం తప్పు అని చెప్పలేము. జాతి ఔన్నత్యాన్ని ప్రతిబింబించే సాంప్రదాయ రీతులని గౌరవించుకోవాల్సిందే. కానీ, ఆ మిషతో ఆధునిక కవిత్వాన్ని చులకన చేయటం ఎంతవరకు సమంజసం?

విచిత్రం ఏమిటంటే, ఇద్దరూ సాహితీ ప్రియులే! ఇద్దరూ మంచి కవిత్వాన్ని ఆస్వాదించగలిగే స్థాయి ఉన్నవాళ్ళే. మరి ఆయా ధోరణుల వల్ల కవిత్వానికి ఏరకంగా చేటు వస్తుందని అడిగితే, ఇతమిథ్ధంగా చెప్పలేము. అసలు ఇక్కడ కలిగే మౌలిక సందేహం ఏమిటంటే, ఈ పరిస్థితులు ఈకాలంలోనే ఉన్నాయా? సాంప్రదాయ కవిత్వానికి పట్టంకట్టిన గతకాలంలో లేవా? కృష్ణదేవరాయలవారి ఆస్థానంలో ప్రవేశానికి తెనాలి రామలింగ కవి ఎన్నేసి అగచాట్లు పడ్డారో కథలు విన్నాం. గ్రూపులు కట్టిన కవుల ఒకరినొకరు ఎలా ఎగతాళి చేసుకునేవారో కూడా కథలు కథలుగా విన్నాం. రాజుగారి ప్రాపకానికి కవులు ఏరకంగా పోటీలు పడేవారో కూడా విన్నాం.

అంతేకాదు, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన ఆంధ్రులకి చెప్పుకోదగ్గ కావ్యాలు ఎన్ని ఉన్నాయంటారు? ఒక వందా, రెండు వందలా, మూడు వందలా? మరి వేల సంవత్సరాల ఘనసాహితీ చరిత్రలో మిగిలినవి ఇవేనా? అంటే, ఇప్పుడు వస్తున్న "చెత్త కవిత్వం" స్థాయిలో ఆనాడు “చెత్త కావ్యాలు” రాలేదని చెప్పగలమా? కాదు కూడదు అంటే మనకు మిగిలిన కావ్యాలు ఎన్ని? నాణ్యతలేని కావ్యాలు కాల పరీక్షకు నిలువలేకపోయావనేకదా అర్ధం. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పటి కవిత్వమే చెత్త అని సాంప్రదాయబద్ధమైన ఛందోబద్ధమైన కవిత్వాన్ని నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? చెత్త ఎప్పటికైనా చెత్తే, అవి చరిత్రలో మనవు అని ఎందుకు సరిపెట్టుకోలేము?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి