26 జనవరి 2020

మూడో కన్నీటి చుక్క - పరిచయం


కథన కవిత్వమనేది మన సాహితీ ప్రపంచానికి కొత్తదైన విషయం కాదు. కొన్నేళ్ళ క్రితం ‘వృద్ధ జంట’ అనే కథన కవిత్వం బ్లాగులో ప్రచురించారు బొల్లోజు బాబా గారు. దాని మీద వాడివేడైన చర్చ జరిగింది. ఆ చర్చలో ఒక ముఖ్యమైన సారాంశం కవిత్వంలో క్లుప్తత మీద బాబాగారి అభిప్రాయం వేరు. కాబట్టి, క్లుప్తత పరిధిని దాటి ఈ పుస్తకం చూస్తే బాగుంటుంది. ఈ పుస్తకంలోని చాలా పద్యాలు కథనకవిత్వం పోకడలోనే సా....గుతాయి. అయినా క్లుప్తత పరిధులు దాటి చూస్తే బాగుంటాయి.

కొన్ని కవిత్వాలు చదివి బాధపడతాం. కొన్ని చదివినందుకు బాధపడతాం. మరి కొన్ని చదవాల్సివచ్చినందుకు బాధపడతాం. కానీ, చదవలేనందుకు బాధపడాల్సిన కవిత్వం బాబాగారి ‘మూడో కన్నీటి చుక్క’ లో చాలా ఉంది. విచిత్రం ఏమిటంటే, ఈ పుస్తకం శీర్షిక క్లుప్తంగా ఆయన వ్రాసిన ఒకానొక ఫ్రాగ్మెంట్స్ లోని ఒక అద్భుతమైన పద్యం :

ఏ రెండు
కన్నీటి చుక్కలు ఒకేలా ఉండవు
వాటిని చూసినపుడు
జారిన మూడో కన్నీటి చుక్క
కవిత్వం.

***

ఇక, బాబాగారి కవిత్వంలో మరో కోణం సామాజికత. సామాజిక నేపథ్యంలో వ్రాసే కవితల వల్ల సమాజం బాగుపడే అవకాశాలు అంతంత మాత్రమే. ఎందుకంటే, సాహిత్యంతో సమాజాన్ని ఉద్ధరించేయగలమనేది ఓ భ్రమే అన్నది నా అభిప్రాయం. ఈ అభిప్రాయానికి మూలకారణం, సామాజికత పేరుతో ఇప్పుడు వస్తున్న కుల కవిత్వాలు, వాద కవిత్వాలు. ఇవేవీ నినాదాల స్థాయిని దాటకపోవటమే.

కానీ, ఈ పుస్తకంలో నినాదాలు లేకుండా నేరుగా సమాజాన్ని స్పృశించే కొన్ని పద్యాలు ఉన్నాయి. అందుకు మొట్టమొదటి పద్యం ఓ స్పష్టమైన ఉదాహరణ.

ఒక దు:ఖానికి కొంచెం ముందు...

అప్పటికింకా అతను
చెట్టుకొమ్మకు పిడికెడు మట్టై
వేలాడలేదు
చేనుగట్టుపై కూర్చొని
ఎండిన పంటను
ఓదారుస్తున్నాడు, ఇసుక
నిండిన హృదయంతో.

...
...

అప్పటికింకా ఆ చెట్టుకొమ్మ
ఉరికంబం పాత్రను
ధరించలేదు
పక్షిగూడు దిశగా పాకుతున్న
పామును
శ్రద్ధగా చూస్తోంది.

క్లుప్తత మీద ఆయనకున్న అభిప్రాయంతో ఏకీభవించను కాబట్టి, చివరి చరణాన్ని ఉదహరించటంలేదు.

***

అలానే రెండో పద్యం ‘కలలు’

జీవితం అనే పదునైన కత్తి
కాలాన్ని
ఆఫీసు, అనుబంధాలు, స్వప్నాలుగా
ముక్కలు ముక్కలు చేసి వడ్డిస్తుంది

దినాంతాన
స్వప్నాలు మాత్రమే
మన జేబులో మిగిలే
చివరి చిల్లర నాణేలు

***

మనసుకు హత్తుకునే, ఆలోచింప చేసే పద్యాలు బోలెడు ఉన్నాయి ఈ పుస్తకంలో. ఏదేమైనా, బొల్లోజు బాబాగారు ఓ మంచి కవి, మంచి మనసున్న కవి, మానవత్వం ఉన్నకవి, మనిషి కవి, మనిషిని చదివిన కవి. కొనుక్కొని చదవాల్సిన కవిత్వం ఈ మూడో కన్నీటి చుక్క.

ఎప్పుడు పద్యాల పుస్తకం ప్రచురించినా నన్ను గుర్తుంచుకొని పుస్తకం పంపించే బాబాగారికి, ఈ పుస్తకానికి గాను కృతజ్ఞతలు. మంచి పద్యాలు వ్రాసినందుకు మరిన్ని అభినందనలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి